ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్, తాజాగా వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. దీంతో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా..? అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల తెర ముందుకు వచ్చింది. 2019 అనంతరం లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో మళ్లీ రాజకీయ నాయకులతో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో శని, ఆదివారాల్లో లగడపాటి పర్యటించి పలువురు రాజకీయ నాయకులతో ముచ్చటించారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌తోపాటు వైసీపీ, కాంగ్రెస్ నేతలతోనూ లగడపాటి సమావేశం కావడంతో.. ఆయన వైసీపీ చేరుతాడా..? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
అయితే.. ఒకప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో లగడపాటి రాజగోపాల్ కీలక నేత. 2014లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రేతో హల్‌చల్ చేసిన లగడపాటి ఆ తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఓ సర్వేతో మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.. 2019లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. తెలంగాణాలో టీఆర్ఎస్ ఓడిపోతుందని ప్రకటించారు. అయితే ఆయన సర్వేకు భిన్నంగా ఎన్నికల్లో ఫలితాలు రావడంతో ఆయన మళ్లీ మీడియా ముందుకు రాలేదు.