సంజయ్‌ రౌత్‌కు నాలుగు రోజుల ఈడీ కస్టడీ..

-

పాత్రాచల్‌ కుంభకోణం కేసులో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగు రోజుల పాటు ఈడీ కస్డడీకి అప్పగించింది. నగదు అక్రమ చలామణి కేసుకు సంబంధించి రౌత్‌ ఇంట్లో నిన్న దాదాపు తొమ్మిది గంటల పాటు సోదాలు జరిపిన అధికారులు.. ఆదివారం అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆయన్ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు, సంజయ్‌ రౌత్‌ అరెస్టుపై శివసేన శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు బయట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కోర్టు హాలులోకి వెళ్లడానికి ముందు రౌత్‌ రెండు చేతులూ జోడించి జై మహారాష్ట్ర అంటూ నినదించారు. శివసేనను విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలు ఫలించవని వ్యాఖ్యానించారు.

ఈ కేసు విచారణ సందర్భంగా సంజయ్‌ రౌత్‌ను ఎనిమిది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ సందర్భంగా గుర్తించిన వాస్తవాల దృష్ట్యా నిందితుడికి కస్టడీ తప్పదనే నిర్థారణకు వచ్చినట్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈడీ అడిగినట్టు ఎనిమిది రోజులు కాదని.. నాలుగు రోజుల పాటు మాత్రమే దర్యాప్తు సంస్థ కస్టడీకి ఇస్తున్నట్టు తెలుపుతూ ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి అనుమతించారు.

సంజయ్‌ రౌత్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. ఔషధాలు, ఇంటి భోజనం అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ తెలిపింది. గృహ సముదాయం (పాత్రాచాల్‌) పునరాభివృద్ధిలో భారీ అక్రమాలు జరిగాయంటూ సంజయ్‌ రౌత్‌ భార్య, అతని సన్నిహితులపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో సంజయ్‌ రౌత్‌ జులై 1న ఈడీ అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సార్లు సమన్లు జారీ అయినా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయంటూ గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్‌ నివాసం ‘మైత్రి’కి చేరుకున్నారు. 9 గంటలపాటు విచారించిన తర్వాత ఆయనను ముంబయిలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక రౌత్‌ అరెస్టు విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news