ఉక్రెయిన్ లో భారతీయులు చిక్కుకున్నారు. క్యివ్ ఎయిర్ పోర్టులో ఏకంగా.. 20 మంది విద్యార్థులు ఆగిపోయారు. అవస్థలు పడుతున్నామంటూ కుటుంబ సభ్యుల ద్వారా బండి సంజయ్ కు మొర పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ కార్యాలయంతో వారు సంప్రదింపులు కూడా చేశారు. భారత్ కు వచ్చేందుకు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారు.
అయితే.. ఈ రోజు క్యివ్ ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో అక్కడి ప్రభుత్వం ఎయిర్ పోర్టును మూసివేసింది. అటు స్వదేశం రాలేక, ఇటు యూనివర్శిటీకి వెళ్లలేక దాదాపు 20 మంది ఎయిర్ పోర్టు వద్దే చిక్కుకుపోయారు. వీరిలో కరీంనగర్ కు చెందిన మెడికల్ విద్యార్థి కడారి సుమాంజలితోపాటు తెలంగాణకు చెందిన రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత ఉన్నారు.
వీరంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే కావడం విశేషం. వీరితోపాటు దాదాపు 20 మంది ఎయిర్ పోర్ట్ వద్ద చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని కడారి సుమాంజలి తన సోదరుడు కడారి స్వామికి ఫోన్ చేసి తాము ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయాన్ని వివరించారు. అయితే.. వీరిని ఇండియాకు రప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది.