సీరం సంస్థకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. క్షణాల్లోనే రూ.కోటి స్వాహా..!

-

సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలు చేయడానికి రోజుకో రూట్ వెతుకుతున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో కొందరిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. వారి నుంచి లక్షలు, కోట్లు వసూల్ చేస్తున్నారు. తాజాగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా పేరు చెప్పి సైబర్‌ నేరగాళ్లు రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డారు.

వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్లలో ఒకరైన సతీశ్‌ దేశ్‌పాండేకు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌ చేశారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను పంపారు. దీంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. డబ్బంతా పంపించాక తెలిసింది ఆ మెసేజ్‌ పూనావాలా పంపలేదని. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాత సీరం సంస్థ సిబ్బంది మహారాష్ట్రలోని బండ్ గార్డ్ పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నెల 7,8 తేదీల్లో ఈ లావాదేవీలన్నీ జరిగాయి. ఐదు రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకులకు డబ్బులు జమ అయినట్లు బండ్ గార్డ్ పోలీసులు తెలిపారు. బంగాల్, బిహార్, ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ బ్యాంకులలోని నేరగాళ్ల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news