మీరు ఇంటి నుంచే పని చేయాలనుకుంటున్నారా..? కూర్చున్న చోటు నుంచి కదలకుండా నెలకు రూ.50వేలు సంపాదించాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు నెలకు రూ.లక్ష రూపాయలు మీ సొంతం. ఇలా రకరకాల యాడ్లతో కొంతమంది కేటుగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. వారి మాటలు నిజమని నమ్మి.. ఉద్యోగం పొందడానికి డబ్బు ముట్టజెప్పి ఆ తర్వాత తాము మోసపోయామని గ్రహిస్తున్నారు. చివరకు తలలు బాదుకుంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
తాజాగా వర్క్ ఫ్రం హోం పేరిట హైదరాబాద్లో కొందరు కేటుగాళ్లు భారీ మోసానికి తెర తీశారు. సామాజిక మాధ్యమాల నుంచి ఉద్యోగం అంటూ ఎరవేసిన కేటుగాళ్లు అమాయకుల నుంచి రూ.70 లక్షలు దోచేశారు. రూ.లక్షల్లో ఆదాయం అంటూ బాధితులకు మాయమాటలు చెప్పి హైదరాబాద్లో నలుగురి నుంచి రూ.70 లక్షలు కాజేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా షేర్ మార్కెట్, యూట్యూబ్ వీడియోలు క్లిక్ చేసే వర్క్ ఉందని మోసానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఇంట్లోనే ఉంటూ రూ.లక్షలు సంపాదించవచ్చని బురిడీ కొట్టించారని చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.