కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. అందులో భాగంగానే అనేక చోట్ల భారీ ఎత్తున టీకాలను వేస్తున్నారు. అయితే కోవిడ్ covid టీకాలపై ఉన్న భయాల కారణంగా పలు రాష్ట్రాల్లో ప్రజలు టీకాలను వేయించుకునేందుకు ఆసక్తిని చూపించడం లేదు. దీంతో కొన్ని చోట్ల ప్రజలకు పలు ఆఫర్లను అందిస్తున్నారు.
బీహార్‌లో కోవిడ్ టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు, టీకాలపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు అక్కడి హోటళ్లు, సినిమా హాళ్లు నడుం బిగించాయి. అందులో భాగంగానే అక్కడ హోటళ్లలో ఒక రోజు ఉచితంగా వసతి సౌకర్యం అందిస్తున్నారు. ఒక రోజు ఉన్నా హోటళ్లలో ఎలాంటి చార్జిలను తీసుకోవడం లేదు. ఇక సినిమా హాల్స్ లో 30 శాతం తగ్గింపు ధరలకు టిక్కెట్లను అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్లను పొందాలంటే ప్రజలు తాము రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధ్రువపత్రాన్ని చూపించాలి.
కోవిన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీహార్‌లో జూలై 2వ తేదీ వరకు 7.4969 మిలియన్ల మహిళలు, 9.153 మిలియన్ల పురుషులు టీకాలను వేయించుకున్నారు. అక్కడ రానున్న 6 నెలల్లో 60 మిలియన్ల మందికి టీకాలను వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 3 లక్షల మంది చొప్పున నెలకు 10 మిలియన్ల డోసులను వేయనున్నారు. అయితే టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు టీకాలంటే భయపడుతున్నారు. అందుకనే అక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ నెమ్మదిగా కొనసాగుతోంది. అందువల్లే అక్కడ హోటళ్లు, థియేటర్లు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 2 వారాల కిందటే హోటల్స్ ప్రారంభం కాగా, జూలై 7 నుంచి అక్కడ థియేటర్లను ఓపెన్ చేస్తారు.