గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని సినిమాల్లో అన్నది నూటికి నూరుపాళ్లు నిజమే.. మనసులు సాధించాలనే తపన గట్టిగా ఉంటే.. కచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇందులో మహిళలే ముందుంటారు. అసాధ్యం కాదనుకున్నది సుసాధ్యం చేసి చూపుతున్నారు. రాజాస్థాన్ కు చెందిన రుకమ్మీ దేవీ కటారా కూడా ఈ జాబితాలోకే వస్తుంది. సవాళ్లను అధిగమిస్తూ.. చిన్న వయసులోనే పెళ్లై తల్లైన ఆమె నేడు వ్యాపారం చేసే స్థితికి వచ్చింది. ఈ స్పూర్తిధాయకమైన కథ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని దుంగార్‌పూర్ అనే చిన్న గ్రామం రుకమ్నిది. 13 ఏళ్లకే పెళ్లి.. 16 ఏళ్లకే గర్భం..భర్తతో కలిసి ఇంటి వద్దే ఓ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగించేది రుకమ్ని. కానీ అలా జీవించడం ఆమెకు నచ్చలేదు. ఏదో సాధించాలన్న తపన ఆమెను అనునిత్యం వెంటాడేది. దీనికి తోడు ఆమె అత్తింటి వారు ‘వ్యాపారం నీకెందుకు? ఇంటి పట్టున ఉంటూ పిల్లల్ని చూసుకోక!’ అన్న మాటలు తనలో పట్టుదలను మరీ పెంచాయని పెంచాయట.
విద్యుత్ తయారు కావాలంటే నీరు, బొగ్గు.. వంటి సహజ వనరులు అవసరం.. పైగా మన దేశంలో బొగ్గుతో తయారయ్యే విద్యుత్తే ఎక్కువ శాతం ఉంది. దీనివల్ల బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో పాటు.. పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుందనేది మనందరికి తెలిసిన విషయమే.. ఇదే విషయం రుకమ్నిని కలిచి వేసింది. ఐఐటీ ముంబయి ప్రొఫెసర్, సౌర విద్యుత్ నిపుణులు అయిన చేతన్ సోలంకి.. తాను తయారుచేసే సౌర విద్యుత్ దీపాలను ఉదయ్‌పూర్ చుట్టుపక్కల గ్రామాల్లో చదువుకునే పిల్లలకు అందించడానికి అన్వేషణ మొదలుపెట్టారు. ఈ బాధ్యతల్ని మహిళకు అప్పగించాలనుకున్న ఆయన.. రుకమ్నిని ఇందుకోసం ఎంపిక చేశారు. దాంతో అప్పటివరకు ఇంటికే పరిమితమైన ఆమె.. సోలంకి అప్పగించిన పనుల కోసం.. తొలిసారి గ్రామం దాటి బయట అడుగుపెట్టింది. అలా మొదలైన ఆమె సోలార్ ప్రయాణం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది.
పర్యావరణ స్పృహ, సౌర విద్యుత్ దీపాల పంపిణీ.. ఆమె మనసును పూర్తిగా సౌర విద్యుత్ శక్తి వైపు తిప్పేశాయి. ఈ క్రమంలోనే దేశంలో సౌర విద్యుత్ విప్లవం సృష్టించాలనుకుంది ఆమె… 2017లో తన గ్రామంలోనే ‘దుర్గా ఎనర్జీ’ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. సౌర విద్యుత్ ప్యానల్స్‌ని తయారుచేసి వాటిని ఇళ్లు, స్కూళ్లు, ఇతర వ్యాపార సముదాయాలకు అందించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇందుకు ఐఐటీ ముంబయి, రాజస్థాన్ ప్రభుత్వం తమ వంతు సహకారం అందించాయి. అక్కడి ఓ పురాతన పాఠశాలను ఈ సంస్థ కార్యకలాపాల కోసం కేటాయించింది. సుమారు 3 లక్షలకు పైగానే సౌర విద్యుత్‌శక్తి ప్యానల్స్ను రూపొందించిందీ సంస్థ.
అక్కడందరూ మహిళలే..
తన సంస్థ కార్యకలాపాల్లో సుమారు 40 మంది మహిళల్ని భాగం చేసింది. వారిలో ఏ ఒక్కరూ పాఠశాల దశ కూడా దాటలేదు. అయినా అప్పగించిన పనిని శ్రద్ధతో, నిబద్ధతతో చేయగలరు. ఇలా తపన ఉంటే తమ కాళ్లపై తాము నిలబడగలమని నిరూపించారు మా వద్ద పనిచేసే మహిళలు’ అంటూ చెప్పుకొచ్చిందామె. పర్యావరణ పరిరక్షణ, విద్య-సాంకేతిక పరిజ్ఞానం నోచుకోని మహిళలకు ఉపాధి కల్పించడం.. ఈ రెండు లక్ష్యాలతో మొదలుపెట్టిన తన సంస్థకు ఇన్ని పేరు ప్రఖ్యాతులు వస్తాయని కలలో కూడా అనుకోలేదంటోంది రుకమ్ని.
రుకమ్ని.. ఈ ఏడాది ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ప్రారంభించిన ‘వన్ ఆఫ్ ఛేంజ్’ క్యాంపెయిన్‌కు నామినేట్ అయింది. ఇందులో భాగంగా తమ చేతలతో ప్రపంచ గతిని మారుస్తోన్న కొంతమంది వ్యక్తుల విజయగాథల్ని లఘుచిత్రాల రూపంలో ప్రదర్శించనున్నారు. అందులో రుకమ్ని సక్సెస్ స్టోరీ కూడా షార్ట్ ఫిల్మ్ రూపంలో రూపొందుతోంది. తద్వారా మరెంతో మందికి చేరువై ఆదర్శంగా మారనుందీ సోలార్ వారియర్.