తెలంగాణలో పదో తరగతి పరీక్ష పత్రాలు వరుస లీకేజీల వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ పేపర్ల లీకేజీల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికి పోయాయి. ఐతే ఇది లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్ అంటూ అధికారులంటున్నారు. అసలు పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయో మాత్రం మిస్టరీగా మారింది. అటు పలు రాజకీయ పార్టీల మధ్య నిందోపనిందలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ పేపర్ లీకేజీ లకు పాల్పడ్డాడని అన్నారు. పేపర్ లీకేజీ ప్రభావంతో లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక సంఘర్షణకు ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలకు కారకుడైన బండిసంజయ్‌ను బీజేపీ ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు ముగిసే వరకు ఆయనను జైలులోనే ఉంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీల విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.