కేసీఆర్ పై పొగడ్తల వెనుక గద్దర్ ప్యూహం ఇదే ?

-

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ సడన్ గా సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఏంటి ? గ్రేటర్ ఎన్నికల వేళ గద్దర్‌ నోటి నుంచి వచ్చిన మాటల పై ఇప్పుడు అధికార,విపక్ష పార్టీల మధ్య హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురం డివిజన్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ఆ డివిజన్‌ పరిధిలోనే నివాసం ఉంటోన్న గద్దర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్‌ చేసిన దీక్షను గుర్తు చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించడం రాజకీయ చర్చకు దారితీసింది.

గ్రేటర్ ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రజాగాయకుడు గద్దర్‌ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. సీఎం కేసీఆర్‌ను పాలనా దక్షునిగా కొనియాడారు గద్దర్‌. సీఎం కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టినట్టు అయితే.. దానికి అనుబంధంగా కల్చరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి వెంట నడుస్తా అని కొత్త ట్విస్ట్ ఇచ్చారు గద్దర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సగభాగం సస్యశ్యామలంగా మారిందని.. రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని ప్రశంసించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ సమయంలోనే సీఎం కేసీఆర్‌తో దాదాపు అరగంటపాటు గద్దర్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌పై ఇదే గద్దర్‌ చేసిన విమర్శలను మరికొందరు గుర్తు చేస్తున్నారు. దొరల తెలంగాణ కాదు.. దళితుల తెలంగాణ కావాలని నాడు గళమెత్తారు గద్దర్‌. ఫామ్‌ హౌజ్‌లో కూర్చుని పాలన సాగించడం ఎక్కడా చూడలేదని ఆరోపణలు చేశారు. అలాంటి ప్రజాయుద్ధ నౌక ఇప్పటికప్పుడు ఎందుకు గళం సవరించారో అని చర్చ జరుగుతోంది.

ముందస్తు ఎన్నికల సమయంలో గద్దర్‌ కుమారుడు రాజకీయాల్లోకి వచ్చారు. కుమారుడికి టికెట్‌ కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే కుమారుడి టికెట్‌ కోసం మాట్లాడలేదని.. తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పేందుకే వెళ్లినట్టు తెలిపారు గద్దర్‌. మరి.. ఇప్పుడేమైనా కొడుకు రాజకీయ భవిష్యత్‌ కోసం గళం సవరించారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట. గవర్నర్‌ కోటాలో కవి గోరటి వెంకన్నను ఎమ్మెల్సీని చేయడంతో గద్దర్‌ మనసు ఏమైనా మారిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news