ఏపీలో వినాయక చవితి వేడుకలు రాజకీయ వివాదంగా మారాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని 10 వామపక్ష పార్టీలు సమర్థించాయి. వినాయక చవితి ఆంక్షలు రాజకీయా వివాదంపై 10 వామపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన చేశాయి. వినాయక చవితి పేరుతో బీజేపీ వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తుందని వామపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో సామరస్య, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బిజెపి నాయకులు ప్రయత్నం చేస్తున్నారని వామపక్షాలు మండిపడుతున్నాయి. వినాయక చవితిని ఒక వివాదంగా మార్చడాన్ని వామపక్షాలు ఖండిస్తున్నాయి.
కోవిడ్ మూడవ దశ పొంచి వున్న ప్రస్తుత తరుణంలో ప్రజలంతా కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ వినాయకచవితి జరుపుకోవాలని కోరుతున్నామని చెబుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ విజృంభించినప్పుడు కేంద్ర బిజెపి రాష్ట్రానికి ఏ సహాయమూ చేయలేదని ఆరోపించాయి. రాష్ట్రం కోరిన మేరకు వ్యాక్సిన్‌లను ఇవ్వకుండా వివక్షను చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం పండగ సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సైతం విస్మరించి రాష్ట్ర బిజెపి నాయకత్వం ప్రజల విశ్వాసాలతో రాజకీయ కుతంత్రం నడుపుతోందని ఆరోపిస్తున్నాయి. బీజెపీ వైఖరిని రాష్ట్ర ప్రజానీకం తిరస్కరించి సామరస్య వాతావరణాన్ని కాపాడాలని కోరుతున్నామని ప్రకటించాయి.