టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరరావు తొలిసారి అధికార వైసీపీపై విమర్శలు చేశారు. చాలా రోజుల పాటు టిడిపికి, రాజకీయాలకు దూరమై ఈ మధ్యనే యాక్టివ్ అయిన గంటా..తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఫైర్ అయ్యారు. అయితే వైసీపీ పూర్తిగా స్క్రిప్ట్ ఇచ్చి గవర్నర్ చేత చదివించిందనే చెప్పాలి. దీంతో గవర్నర్ చేత అబద్దాలు చెప్పిస్తున్నారని చెప్పి టిడిపి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
ఇదే క్రమంలో వైసీపీ తీరుపై గంటా ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ అస్తవ్యస్త పాలన, అనుభవ లేమి, అరాచకాలను కప్పి పుచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపించిందని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పి దాన్ని చట్టబద్దం చేసుకునే ప్రయత్నంలా అనిపించిందని చెప్పుకొచ్చారు.
అసలు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ ఇమేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా నిరంతరం సజ్జల, బుగ్గన మాట్లాడే మాటలనే ఒక సంకలనంలా చేసి గవర్నర్ చేత మాట్లాడించారని విమర్శించారు. ఇక 3రాజధానుల అంశం ప్రస్తావన చేయకపోవడం ప్రభుత్వ నిర్ణయాల డొల్లతనాన్ని బహిర్గతం చేశాయని అన్నారు.
మొత్తంగా గవర్నర్ కూడా తనను ఈ స్థాయికి దిగజారుస్తారని అనుకుని ఉంటే ఈ పదవి తీసుకుని ఉండేవారు కాదేమోనని అనిపించేలా వ్యవహరించారని గంటా వైసీపీపై విరుచుకుపడ్డారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచాక గంటా టిడిపిలో యాక్టివ్ గా లేరు. మధ్యలో వైసీపీలొకి వెళ్తారని ప్రచారం జరిగింది..కానీ అటు వెళ్లలేదు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు గంటా టిడిపిలో యాక్టివ్ అయ్యి దూకుడుగా ముందుకెళుతున్నారు.