వాట్సాప్‌లో డిజీలాకర్ సేవలను ఇప్పటి నుంచి పొందవచ్చు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా ప్రజలకు అందుబాటులో తీసుకోరావడానికి ప్రభుత్వం MyGov హెల్ప్ డెస్క్ ను గతంలో ప్రారంభించింది. అయితే, తాజాగా వాట్సాప్ నుంచి డిజీలాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన జారీ చేసింది.
దీంతో పాన్‌కార్డ్, సీబీఎస్ఈ 10వ తరగతి సర్టిఫికెట్లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, బైక్ బీమా, మార్క్ షీట్‌లు, బీమా పాలసీలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వినియోగదారులు చాట్‌బాట్ ద్వారా +91 9013151515 నెంబర్‌కు హాయ్ లేదా డిజీలాకర్ అని మెసేజ్ పంపించడం ద్వారా సేవలు పొందవచ్చు.
గతేడాది మార్చి నెలలో వాట్సాప్‌లో MyGov హెల్ప్ డెస్క్ ను ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని కరోనా హెల్ప్ డెస్క్ అని పిలిచేవారు. కరోనా సంబంధిత సమాచారం, వాక్సిన్ అపాయింట్‌మెంట్, వాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ తదితర సేవలు అందిస్తూ వచ్చింది. దాదాపు ఇప్పటివరకు 10 కోట్ల మంది డిజీలాకర్‌లో రిజిస్టర్ చేసుకోగా.. 500 కోట్లకు పైగా డాక్యుమెంట్లను ప్రభుత్వం జారీ చేశారు.