తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలు వేడిని రాజేశాయ్.. ఆ ఎలక్షన్ మూడ్ పోకముందే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఎలక్షన్ కమిషన్. నవంబర్ 14 తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. గ్రేటర్ ఎన్నికల కోసం ఎస్ఈసీ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఎన్నికలపై ఆయా పార్టీల సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో కూడా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ఉపయోగిస్తామని స్పష్టం చేసింది SEC.
డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికీ ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చని అంతా భావించారు. అయితే ఆలస్యం ఎక్కువగా లేకుండా వీలైనంత తొందరగానే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది.
ప్రభుత్వ సంకేతాలతో GHMC జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అభివృద్ధి పనులు వేగిరమయ్యాయి. వాటి తర్వాత ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వరద బాధితులకు ఇచ్చే పదివేల రూపాయల సాయాన్ని 31లోగా అందించాలని GHMC అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. డబుల్ బెడ్‌రూమ్ పనులు, రహదారుల పనులు పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా వచ్చాయ్. GHMC చట్టానికి ఇటీవల చేసిన సవరణల మేరకు డివిజన్ల రిజర్వేషన్ యధావిధిగా ఉంటుంది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత ఉండటంతో.. 150 డివిజన్లలో 75 పూర్తిగా మహిళలకే కేటాయిస్తారు. ఓటర్లు కూడా నామినేషన్ల గడువు వరకూ నమోదు చేసుకునే అవకాశముంది.