స్వచ్ఛ ఆటో కార్మికులకు షాక్‌.. చెత్త తీసుకెళ్లేందుకు అధిక డబ్బులు డిమాండ్‌ చేస్తే ఇక అంతే..

ఇంటికి వచ్చి చెత్తను తీసుకెళ్లే స్వచ్ఛ ఆటో కార్మికులకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ షాక్‌ ఇచ్చింది. స్వచ్ఛ ఆటోల పని తీరును మెరుగు పరిచేందుకు జీహెచ్‌ఎంసీ పటిష్టమైన చర్యలు చేపట్టింది. స్వచ్ఛ ఆటోల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం, లక్ష్యాన్ని మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇంటింటి వ్యర్థాల సేకరణపై ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచే కాకుండా రెసిడెన్షియల్‌ కాలనీల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. స్వచ్ఛ ఆటోలకు కేటాయించిన లక్ష్యం మేరకు చెత్త సేకరణ చేయని పక్షంలో సంబంధిత ఆటోను ఇతరులకు ఇచ్చేందుకు తాజాగా నిర్ణయించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. వాహన డిజైన్‌ మార్చినా, ఇతర ప్రదేశాల్లోకి వెళ్లినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సంబంధిత వాహనాన్ని ఇతర నిరుద్యోగ యువతకు అందించేందుకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

rspnetwork.in: K.T.Rama Rao, Hon'ble Minister for MA&UD handed over the 350 Swachh  Autos to the beneficiaries for collection of garbage

వార్డులో కేటాయించిన స్వచ్ఛ ఆటోలు, కాలనీల కేటాయింపు, ఒకొక ఆటోకు ఇండ్ల కేటాయింపు, ఇంటింటికీ రుసుం వసూళ్లు చేసే వివరాలను సంబంధిత కార్పొరేటర్‌కు ముందుగా వివరించి అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కార్పొరేటర్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయనున్నారు. స్వచ్ఛ ఆటోల పని తీరు, కేటాయించిన ఇండ్ల నుంచి చెత్త సేకరణ ప్రక్రియను మెరుగుపరిచే విధంగా సంబంధిత కార్పొరేటర్‌, అధికారులు, స్వచ్ఛ ఆటోల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తారు. ఈ సందర్భంగా స్వచ్ఛ అటో దారులు పడుతున్న ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకొని కార్పొరేటర్‌ స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో పరిషార దిశగా చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కేటాయించిన కాలనీల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తప్పనిసరిగా ఇండ్ల నుంచి వందకు వంద శాతం చెత్త సేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఒక వేళ లక్ష్యాన్ని పూర్తిచేయని పక్షంలో, నిర్దేశించిన సమయం వరకు ఉండని పక్షంలో కేటాయింపును రద్దు చేసి, ఆ వాహనాన్ని ఇతరులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు. స్వచ్ఛ ఆటోల యజమానులు తనకు కేటాయించిన కాలనీలో మాత్రమే సేకరణ చేయాలని, ఇతర కాలనీల్లో వ్యర్థాల సేకరణ చేస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.