కరోనా నేపథ్యంలో దేశంలో స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే చాలా మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్ల ద్వారా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతూ పాఠాలను వింటున్నారు. ఇక చాలా మంది పేదరికంలో ఉండడం వల్ల అలాంటి డివైస్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు చదువులకు దూరం అవుతున్నారు. అయితే ఆ విద్యార్థిని కూడా పేద కుటుంబానికి చెందినది. కానీ ఫోన్ లేనందున తాను చదువుకు దూరం కాకూడదని భావించింది. దీంతో ఆమె ఫోన్ కొనేందుకు మామిడి పండ్లను అమ్మడం మొదలు పెట్టింది.
జంషెడ్‌పూర్‌కు చెందిన 11 ఏళ్ల తులసి కుమారి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అయితే కరోనా వల్ల ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. కానీ ఆన్‌లైన్ క్లాసులకు హాజరు అయ్యేందుకు ఆమె వద్ద ఫోన్ లేదు. దీంతో ఫోన్ కోసం ఆమె మామిడి పండ్లను అమ్మడం మొదలు పెట్టింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీంతో ఓ పారిశ్రామిక వేత్త స్పందించారు.
వాల్యుబుల్ ఎడ్యుటెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎండీ అమెయా హెటె ఆ బాలిక విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఆమె నుంచి 12 మామిడి పండ్లను ఒక్కోటి రూ.10వేల చొప్పున మొత్తం పండ్లను రూ.1.20 లక్షలకు కొన్నారు. ఆ మొత్తాన్ని ఆమె తండ్రి అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో ఆ బాలిక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. ఇకపై తనకు ఆన్‌లైన్ క్లాసులకు హాజరు అయ్యేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ బాలిక సంతోష పడుతోంది.