గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 5ను జారీ చేశారు. రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వాకాటి అరుణ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో జనవరి ఒకటో తేదీ నాటికి రెండేళ్లు పూర్తయితే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 317 జీవో ఉపాధ్యాయులకు జీరో సర్వీసు ఇచ్చి బదిలీ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. గత ఏడాది 317 జీవో ప్రకారం కొత్త జిల్లాల కేటాయింపును హడావిడిగా చేయడంతో వేల సంఖ్యలో తప్పులు దొర్లాయన్న ఆరోపణలొచ్చాయి. అందుకే ఈసారి ఎక్కువ సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు.