ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతుంది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుడ్డడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమ జిల్లాలో మహోగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి గోదావరి పాయలు. అల్లవరం మండలం బోడసక్కుర్రు గ్రామానికి వరద తాకిడి ఏర్పడింది. కోనసీమ లో 73 గ్రామాలపై వరద ప్రభావం ఏర్పడింది. 18 లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో నిర్బంధ మయ్యాయి.
పి.గన్నవరం మండలం అరిగెల వారి పేట, బొరుగులంక, ఊడిమూడిలంక, జీ పెదపూడిలంక, శివయలంక గ్రామాలు జల దిగ్బంధం అయ్యాయి. కాజ్వే నీటమునిగి కనకాయలంక వద్ద ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. వరద బాధితులకు సహాయ చర్యలు చేపడుతు0ది అధికార యంత్రాంగం. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు రావాలంటూ అధికారులు పిలుపునిచ్చారు. దీంతో తమ సొంత ఇల్లు వదిలి పునరావాస కేంద్రాలకు రామని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది.