మీ సేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు తేలింది. శంకర్ భార్య హేమలతతో వివాహేతర సంబంధం నడుపుతున్న రాజు హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెసింది. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో శంకర్ మృతిచెందగా, శరీర భాగాలను సర్జికల్ బ్లేడుతో ముక్కలు చేసిన రాజు, వాటిని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పడేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీసేవలో శంకర్ పనిచేస్తుండగా ఆయన భార్య హేమలత ఎన్టీపీసీ దవాఖానలో ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నది. అదే హాస్పిటల్‌లో స్వీపర్ రాజుతో హేమలతకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం శంకర్‌కు తెలియండంతో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
భర్త శంకర్ హెచ్చరించినా హేమలత తీరులో మార్పు రాలేదు. ఈ నెల 25న హేమలతతో సాన్నిహత్యంగా ఉన్న ఫొటోను శంకర్‌కు రాజు పంపించాడు. అదే రోజు భార్యను హాస్పిటల్‌లో దింపిన అనంతరం మద్యం తాగిన శంకర్ నేరుగా రాజు ఇంటికి వెళ్లగా ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రంలో పదునైన ఆయుధంతో దాడి చేయడంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం శరీర భాగాలను సర్జికల్ బ్లేడ్‌తో ముక్కలు చేసి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో విసిరేసినట్లు సమాచారం. హేమలత ప్రమేయంతో హత్య జరిగిందా? లేక రాజు పథకం ప్రకారం శంకర్‌ను హత్య చేశాడాన్న అనే విషయమై పోలీసులు విచారిస్తునట్లు తెలిసింది.