ప్లీజ్ సహకరించండి.. మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి

అమరావతి: రాష్ట్రంలో రెండవ దశ కోవిడ్‌ కేసులు అధికమవుతున్నందున ప్రతి ఒక్కరూ వైరస్‌ కట్టడికి సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యే ముందు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన కలిశారు. ప్రాణవాయువు 30 శాతం మాత్రమే ఉందని, అత్యవసరంగా కరోనా చికిత్స అందించేలా సహాయం చేయాలని మంత్రిని ఓ వ్యక్తి కోరారు. తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకొంటామని ఆయనకు పేర్ని నాని హామీ ఇచ్చారు.

మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిదశలో వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామన్నారు. రెండవ దశలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటిస్తూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, దానివలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. వ్యాక్సిన్‌ వేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునని చెప్పారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందచేస్తుందన్నారు. గడిచిన ఏడాది కాలంలో కోవిడ్ నివారణకు చాలా చర్యలు చేపట్టామని, ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.