కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తేదీ నుంచి తాత్కాలిక పెన్షన్ చెల్లింపును ఏడాదిపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ), పరిపాలనా సంస్కరణలు, ప్రజా మనోవేదనల విభాగం (డీఏఆర్‌పీజీ) సీనియర్ అధికారులతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జితేంద్ర సింగ్ తాత్కాలిక కుటుంబ పెన్షన్‌పై చర్చించారు. అనంతరం పెన్షన్‌ను సరళీకృతం చేయనున్నట్లు ప్రకటించారు.
కుటుంబ పెన్షన్‌కు సంబంధిన వ్యవహారాలను పే అండ్ అకౌంట్లకు ఫార్వర్డ్ చేయడానికి వేచి ఉండకుంటా.. అర్హత కలిగిన కుటుంబ సభ్యుడి నుంచి కుటుంబ పెన్షన్, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందిన వెంటనే కుటుంబ పెన్షన్‌ను మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని పెన్షన్ దారులు పదవీ విరమణ చేసిన తేదీ నుంచి తాత్కాలిక పెన్షన్ చెల్లింపును ఒక సంవత్సరం పాటు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ పత్రాలను సమర్పించకుండా మరణించడం జరుగుతుంది. అలాంటి వారి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, సరైన ధ్రువపత్రాలను స్వీకరించి పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
పెన్షన్ బకాయిలను విడుదల చేయడానికి (పదవీ విరమణ చేసిన తేదీ నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తేదీ వరకు) పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు జారీ చేయడానికి సూచనలు ఇవ్వబడ్డాయి. ఉద్యోగి మరణించిన తేదీ నుంచి కుటుంబ సభ్యులకు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. అలాగే విధి నిర్వహణలో అంగవైకల్యానికి గురైన వారికి జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ఉద్యోగులకు కూడా మొత్తం పరిహార ప్రయోజనాన్ని కల్పించాలన్నారు. ఈ మేరకు అకౌంటింగ్ ఆఫీస్ (సీపీఏఓ) వినియోగదారులు ఎలక్ట్రానిక్ మోడ్‌లను ఉపయోగించి సీపీఏఓ, బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీపీసీ) ద్వారా పెన్షన్ చెల్లించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.