అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీకి లైన్ క్లియర్ అయింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా కంపెనీకి పొల్యూషన్ అనుమతులు లేవంటూ పొల్యూషన్ బోర్డు షాక్ ఇచ్చింది. అంతేకాదు పరిశ్రమకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. పరిశ్రమను కూడా మూయించివేసింది. దీంతో అమరరాజా గ్రూపు హైకోర్టును ఆశ్రయించింది.
అమరరాజా పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసం గురువారం విచారణ చేపట్టింది. అమరరాజా కంపెనీ మూసేయాలన్న పీసీబీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 17లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని పరిశ్రమకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా వేసింది. మళ్లీ రిపోర్టు ఫైల్ చేయాలని పీసీబీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలతో అమరరాజా కంపెనీకి ఊరట లభించింది.
అమరరాజా కంపెనీని నాలుగు రోజలుగా మూసివేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పొల్యూషన్ బోర్డు తీరుపై మండిపడ్డారు. కంపెనీ మూసివేతతో రోడ్డున పడతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.