తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాజ్ భవన్ లో తేనీటి విందుకు కేసీఆర్ ను ఆహ్వానించామని… ఆయన రావడం, రాకపోవడం అనేది రాజ్ భవన్ పరిధిలో లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే తనను ఎంతో బాధించిందని తమిళిసై చెప్పారు. గవర్నర్ల పట్ల సీఎంలు ఇలా వ్యవహరించడం సరికాదని తమిళిసై అన్నారు.
ఇటీవల ఆర్టీసీ విషయంలో కూడా రాజ్ భవన్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో రచ్చ జరిగింది. గవర్నర్ పై మంత్రులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆర్టీసీ కార్మికులు కూడా చలో రాజ్ భన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు, బిల్లుపై తనకున్న సందేహాలను తీర్చాలంటూ ప్రభుత్వానికి గవర్నర్ కొన్ని ప్రశ్నలు వేశారు. వాటిపై ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాతే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా చోటుకున్నాయి. ఈ క్రమంలో రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య దూరం బాగా పెరిగిపోయింది.