విద్యాసంస్థల పేటెంట్లపై 80శాతం తగ్గింపు.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్

వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన ప్రకారం ఇకపై విద్యాలయాలు తమ పేటెంట్లను పొందడనికి ఉన్న ఫీజును 80శాతం తగ్గించనున్నామని తెలిపారు. మన దే విద్యాసంస్థలకైనా, ఇతర దేశాల్లోని విద్యాసంస్థలకైనా ఇది వర్తిస్తుందని అన్నారు. గతంలో ఈ విధానం కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం దీన్ని పూర్తిగా మారుస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు సహా ఎయిడెడ్ విద్యాలయాలకు కూడా ఈ తగ్గింపు విధానం అమల్లోకి వస్తుంది.

ఈ మేరకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద సీఐఐ నిర్వహించిన వెబినార్ లో ప్రకటించారు. దీనివల్ల గుర్తింపు పొందిన అన్ని విద్యాసంస్థలు లాభం పొందవచ్చని, ఈ మేరకు లాభాన్ని ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ తగ్గింపు విధానం వల్ల ప్రస్తుతం ఉన్న పేటెంట్ ఫీజు 4,24,500 నుండి 85వేలకు తగ్గుతుంది. ఈ పేటెంట్ ఫీజు ప్రపంచంలోనే అతి తక్కువ ఫీజు అయ్యే అవకాశం ఉందని పీయూష్ గోయల్ అన్నారు. ఈ ప్రయోజనాన్ని గుర్తింపు పొందిన ప్రతీ విద్యాసంస్థ, విశ్వవిద్యాలయం పొందాలని కోరుతున్నానని తెలిపారు.

ఈ విధానాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని, Department for Promotion of Industry and Internal Trade (DPIIT) అందుకు సహకరించాలని కోరారు. ఇంకా గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ లో ఇండియా ర్యాంక్ మెరుగుపడాలని, 25వ ర్యాంకు లోపలే వచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, దానికోసం మిషన్ మోడ్ లో పనిచేయాలని అన్నారు. గోయల్ మాట్లాడుతూ 2016నుండి 2020మధ్య కాలంలో 14.2లక్షల ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఇది గత 75ఏళ్ళలో జరిగిన (11లక్షల) దానికంటే చాలా ఎక్కువ అని అన్నారు.