హైదరాబాద్: గ్రేటర్ ఫలితాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏ పార్టీకీ పూర్తీ స్థాయిలో మెజారిటీ దక్కలేదు. ఊహించని ఫలితాలతో సిట్టింగ్ కార్పొరేటర్లు గల్లంతయ్యారు. పెద్ద పార్టీల అభ్యర్థులకూ డిపాజిట్ దక్కక అవాక్కవుతున్నారు. 55 సీట్లతో టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠానికి కొద్ది దూరంలో నిలిచింది. 48 సీట్లతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షమైంది. 44 సీట్లతో ఎంఐఎం పార్టీ మేయర్ ఎన్నికల్లో కీలకంగా మారింది. మొత్తంగా ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి. అయితే ప్రస్తుతం మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ మిగిలింది.
మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్…
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు అసంతృప్తిని మిగిల్చాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డికి తన పరిధిలోని రెండు డివిజన్లలోను అభ్యర్థులు ఓటమి పాలు కావడం నిరాశ కలిగించాయి. ఇక మంత్రి తలసాని తన నియోజకవర్గంలో సగం సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజేంద్రనగర్ లో ఇంచార్జీగా వ్యవహరించిన హోంమంత్రి మహమూద్ అలీ కూడా నిరాశే మిగిలింది. ఐదు డివిజన్లలోనూ ప్రత్యర్థి పార్టీలే విజయం సాధించాయి. పటాన్ చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ప్రచారం నిర్వహించిన మంత్రి హరీశ్ రావు ఈ మూడింటిలో టీఆర్ఎస్ గెలుపు సాధించింది. ఎమ్మెల్సీ కవిత ఇంచార్జీగా వ్యవహరించిన గాంధీనగర్ లోనూ పరాభవమే మిగిలింది. ఇక మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంగుల, నిరంజన్ రెడ్డి, ఈటల ప్రచారంలోనూ గులాబీకి చుక్కెదురైంది.
ఎల్బీనగర్ లో బీజేపీ హవా..
టీఆర్ఎస్ పార్టీకి కుంచకోటగా మారిన ఎల్బీనగర్ నియోజకవర్గం కమలం క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 13 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులే గెలవడం విశేషం. ఇటీవల కురిసిన వర్షానికి ఎల్బీనగర్ లోని పలు డివిజన్లు జలమయమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు బాధితులకు అందక పోవడం, కార్పొరేటర్లు, కార్యకర్తలు జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటర్లలో వ్యతిరేకత పెరగడంతో ఎల్బీనగర్ లో బీజేపీ భారీ స్థాయిలో గెలుపొందింది.