కాంగ్రెస్‌కు ఆజాద్ షాక్.. ఆ ఆఫర్ తిరస్కరణ

-

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను గులాంనబీ ఆజాద్ తిరస్కరించారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీని పునర్వవస్థీకరించే చర్యల్లో భాగంగా నియా గాంధీ గులాం నబీ ఆజాద్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఆజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్‌ వానీని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించారు.

అయితే నియమించిన కొద్ది సేపటికే ఆఫర్‌ను ఆజాద్‌ తిరస్కరించారు. ఆరోగ్య కారణాలతో ఆజాద్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉండటానికి నిరాకరించారని ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో సంస్కరణ తేవాలంటూ గొంతెత్తిన జీ23 నేతల్లో.. ఆజాద్ ఒకరు. ఆజాద్ రాజ్యసభ పదవీకాలం గతేడాది ముగియగా ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పెద్దల సభకు పంపలేదు.

జమ్ము కశ్మీర్​ పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్​ ప్రెసిడెంట్​తో పాటు పలు కమిటీలను నియమించింది అధిష్ఠానం. గత ఎనిమిదేళ్లుగా పీసీసీ చీఫ్​గా ఉన్న అహ్మద్​ మిర్​ జులైలో తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల జాబితా నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను కేంద్రం పక్కకు పెట్టింది.

ప్రస్తుతం ఈ ప్రక్రియంతా దాదాపు పూర్తైన తరుణంలో వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జమ్మూ కశ్మీర్​లో సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రచార కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ.. తదితర కమిటీలను ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news