హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ కరాటే, కుంగుఫూ, కిక్‌బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా విడుదలైన చిత్రాలను చూశాం. కానీ ఈ చిత్రం ఎంఎంఏ నేఫథ్యంలో రూపొందింది. ఇందులో విజయ్ తన ఫిట్‌నెస్ మొత్తం మార్చుకొని రఫ్ లుక్‌లో ఓ ఫైటర్‌లా కనిపించాడు. మరోవైపు ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. దీంతో విడుదలకు ముందే సినిమాకు మంచి హైప్ లభించింది. ఈ క్రమంలో ఎంఎంఏ గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది.
సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసిన వారికి ఇది కొంత పరిచయం ఉంటుంది. కానీ, సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. దాని గురించే ఈ కథనం…
ఎంఎంఏ అంటే?.. ఎంఎంఏ(మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఓ హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, జుజిత్సు, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి యుద్ధ క్రీడల నుంచి తీసుకొన్న టెక్నిక్స్‌తో దీనిని అభివృద్ధి చేశారు. తొలిరోజుల్లో దీనిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆడే అత్యంత క్రూరమైన క్రీడగా విమర్శకులు పేర్కొనేవారు. కానీ, కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడు ఇమేజీ నుంచి బయటపడి.. ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించే క్రీడగా ఎదగడం మొదలైంది. చాలా దేశాలతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఎంఎంఏపై ఆంక్షలు ఉన్నాయి. దీనిలో విజయం సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా తేలుతుంది.
వాస్తవానికి ఈ క్రీడ క్రీ.పూ 648లో పురాతన ఒలింపిక్స్ గేమ్స్‌లో కూడా ఆడినట్లు భావిస్తున్నారు. దీనిని గ్రీకుల యుద్ధ క్రీడగా భావిస్తారు. అప్పట్లో రెజ్లింగ్, బాక్సింగ్ కలగలిపి దీనిని ఆడేవారు. గ్రీక్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చేవారు. క్రీ.శ 393లో రోమన్ చక్రవర్తి ఒలింపిక్స్‌ను బ్యాన్ చేశాక.. ఈ క్రీడ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 20వ శతాబ్దంలో బ్రెజిల్‌లోని వాలే ట్యూడో (ఏదైనా జరగొచ్చు అని అర్థం) ఆట ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో గ్రేసీ అనే సోదరులు ఉత్తర అమెరికాలో ప్రచారంలోకి తెచ్చారు. తర్వాత అమెరికాలోని కొలరాడో, డెన్వర్‌లలో నిర్వహించిన టోర్నిల్లో హెలియో కుమారుడ్ రాయిస్ గ్రేసీ పాల్గొన్నాడు. ఈ టోర్నికి ‘యూఎఫ్‌సీ'(UFC) (అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్) అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థే ఎంఎంఏ ప్రధాన ప్రచారకర్తగా ఎదిగింది. కాల క్రమంలో లక్షల మంది వీక్షకులు దీనికి లభించారు.
నిబంధనలు.. ఎంఎంఏకు స్థిరమైన నిబంధనలు తీసుకొచ్చేలా యూఎఫ్‌సీ కృషి చేసింది. 2009 నాటికి అమెరికాలోని రెగ్యులేటరీ బాడీలు, ప్రపంచ స్థాయి సంస్థలు దీనిలో కొన్ని స్థిరమైన ప్రమాణాలను తీసుకొచ్చాయి. వీటిని ఎంఎంఏ యూనిఫైడ్ నిబంధనలుగా పిలుస్తారు. వీటి ప్రకారం ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతో రింగ్ లేదా ఫెన్స్ మధ్యలోనే పోరాడాలి. బూట్లు వేసుకోకూడదు. తలకు ఎటువంటి కవచాలు ఉండకూడదు. అలానే ప్రత్యర్థి కంట్లో పొడవడం, కొరకడం, జుట్టు లాగడం, తలతో కొట్టడం వంటి పలు అంశాలపై నిషేధం ఉంది.
ఇక ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు తర్వాత నిమిషం విశ్రాంతి ఇస్తారు. అదే ఛాంపియన్ షిప్ బౌట్స్‌లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్ (ప్రత్యర్థితో ఓటమి అంగీకరింపజేయడం) ద్వారా గెలవవచ్చు. ఒక వేళ ఇద్దరు క్రీడాకారులు తీవ్రంగా పోరాడితే.. విజేతలను ప్యానల్ నిర్ణయిస్తుంది.
ఎంఎంఏ ఆర్గనైజేషన్స్ ఇవి.. అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్‌లో ఉన్న యూఎఫ్‌సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ఏటా వివిధ స్థాయుల్లో డజన్ల కొద్దీ ఈవెంట్లు నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో ఈ క్రీడను ప్రసారం చేస్తారు. 1993లో ప్రారంభించిన ఈ ఆర్గనైజేషన్‌ను 2001లో జుఫ్ఫా ఐఎన్‌సీ 2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. యూఎఫ్‌ఎసీ ఆ తర్వాత వరల్డ్ ఫైటింగ్ అలయన్స్, వరల్డ్ ఎక్స్‌ట్రీమ్ కేజ్ ఫైటింగ్ సంస్థలను కొనుగోలు చేసింది. యూఎఫ్‌సీ అధ్యక్షుడు డాన వైట్ ఈ క్రీడ ప్రధాన ప్రచారకుడిగా మారాడు. 2016లో యూఎఫ్‌సీని డబ్ల్యూఎంఈ – ఐఎంజీకి 4 బిలియన్ డాలర్లకు విక్రయించారు.
హాలీవుడ్‌లో దుమ్మురేపిన ఎంఎంఏ చిత్రాలు..
- వారియర్
- నో రూల్స్
- ది హామర్
- బ్లడ్ అండ్ బోన్
- ది ఎక్స్‌పాండబుల్స్