గుంటూరులో షాడో వైసీపీ నేత వ‌సూళ్లు.. ఏం జ‌రుగుతోంది..?

-

గుంటూరు జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌కు వేదిక‌గానే ఉంటాయి. నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, ఆధిప‌త్యం.. ఇలా.. అనేక రూపాల్లో నాయ‌కులు త‌ర‌చుగా రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. పార్టీలు ఏవైనా.. అధికారంలో ఎవ‌రున్నా.. ఈ ప‌రిస్థితి కామ‌నే! అయితే, ఇప్పుడు మ‌రో కొత్త కోణం వెలుగు చూసింది. జిల్లాలో వైసీపీకి కీల‌కం గా ఉన్న ఓ ఎమ్మెల్యే.. త‌న నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. త‌న అనుకూల నేత‌లున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌దీశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌బుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది.

వీటిలో పించ‌న్లు.. ఇత‌ర సామాజిక ప‌థ‌కాలు ఉన్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నేరుగానే ఈ ప‌థ‌కాల‌ను ల‌బ్ధి దారుల‌కు చేరువ చేసినా.. మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త పేరుతో ఎమ్మెల్యేల ఎండార్స్‌మెంట్‌ను చేర్చారు. అంటే.. నేరుగా ఎమ్మెల్యేకి స‌ద‌రు ల‌బ్ధి దారుల‌తో సంబంధం లేక‌పోయినా.. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ల‌బ్ధి దారుల లిస్టును సంబంధిత వ‌లంటీర్ ఎమ్మెల్యేకు ఇస్తే.. దానిని ఆయ‌న ప‌రిశీలించి.. ఎవ‌రైనా అన‌ధికార ల‌బ్ధి దారుడు ఉంటే.. గుర్తించేందుకు అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు జాబితాపై ఎమ్మెల్యే సంత‌కం చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ అవ‌కాశాన్ని కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నా ర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఎక్కడో ఎమ్మెల్యే ఏదో చేశాడంటే.. స‌ద‌రు విష‌యం వెలుగులోకి వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. కానీ, సీఎం జ‌గ‌న్ నివాసానికి స‌మీపంలోనే ఉండే ఓ ఎమ్మెల్యే చేస్తున్న దందా మాత్రం చాలా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఇది కూడా వైసీపీ నేత‌ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

పింఛ‌న్ల విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోయినా.. ఇటీవ‌ల కాలంలో వైఎస్ ఆర్ ఆస‌రా ప‌థ‌కాన్ని జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా 45 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు ఏడాదికి 18 వేల‌ను ప్ర‌బుత్వం అందిస్తుంది. అయితే, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంఅమ‌లు చేస్తున్న కొన్ని స్కీంల కంటే.. దీనిలోనే నిధుల ల‌భ్య‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో స‌ద‌రు ఎమ్మెల్యే దీనిపైనే క‌న్నేశారు.

ల‌బ్ధి దారుల నుంచి రూ.5 వేలు వ‌సూలు చేసి ఇచ్చేబాధ్య‌త‌ను వ‌లంటీర్ల‌కే అప్ప‌గించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఎవ‌రైనా.. వ‌లంటీర్ వ‌సూలు చేయ‌క‌పోతే.. వారంలోనే అత‌నిపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేసి.. ఇంటికి పంపేస్తున్నార‌ట‌. దీంతో వ‌లంటీర్లు వ‌ణికి పోతున్నారు. మ‌రి ఈ ఎమ్మెల్యేగారి వ్య‌వ‌హారం చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news