మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందని… మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. మూడు రాజధానులు సాధ్యం కాదని తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్ల లేదని వైసీపీకి చురకలు అంటించారు. రాజధాని అమరావతిలో పనులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలకు అనువైన వాతావరణం కల్పించేలా ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకేసారి రూ. 50-60 వేల కోట్లు ఖర్చు పెట్టమని అడగడం లేదు.. అది సాధ్యం కూడా కాదని స్పష్టం చేశారు.
కేంద్ర సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతి భవనాల నిర్మాణం చేపట్టేలా ఆయా సంస్థలకు ఇప్పటికే లేఖలు రాశామని చెప్పారు. కేంద్ర సంస్థల భవనాల నిర్మాణం జరిగేలా మా వంతు కృషి చేస్తామని.. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బీజేపీ నిర్ణయమని కుండ బద్దలు కొట్టి చెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.