తెలంగాణలోని విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణాలోని విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకువచ్చింది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సంస్కరణలు 2022-23 నుంచి అమలులోకి రానున్నాయి. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులతో పరీక్ష విధానం ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు ఇవ్వనున్నారు. ఫిజిక్స్, బయాలజీకి సగం సగం మార్కులు ఉంటాయని పేర్కొన్నారు.