ఉగాది తరువాత వచ్చే పున్నమి శ్రీశైలం దారులకు ప్రత్యేకం. శ్రీశైలంకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే సలేశ్వరానికి ఎంతో ప్రత్యేకం. ఇక్కడి జాతరే ఓ ప్రత్యేకం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్న సలేశ్వరంలో వెలసిన శివ లింగం దర్శనానికి భారీ ఎత్తున భక్త జనం వస్తుంది. జన సంద్రం ఆ సందర్భంగా పోటెత్తుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న జాతరకు ఏపీ నుంచి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. నేరుగా వాహనాలు పోయే అవకాశం లేదు. నల్లమల డీప్ ఫారెస్టులో ఉండే ఈ సలేశ్వరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదిలో ఓ 5 రోజుల పాటు మాత్రమే ఈ డీప్ ఫారెస్టులోకి అనుమతి ఉంటుందని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది. అయినా సరే స్వామి చాలా మందికి నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే గొప్ప దేవుడు అని ప్రతీతి. దీంతో ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి వెళ్తారు. మరి! వివాదం ఏంటంటారా? అక్కడికే వద్దాం.
సలేశ్వరాన్ని సందర్శించుకునేందుకు అమ్రాబాద్ డీప్ ఫారెస్ట్ అధికారులే అనుమతి ఇవ్వాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల వాహనాల ను టోల్ గేట్ ద్వారా అనుమతించే పనులు వీళ్లే చక్కదిద్దాలి. చక్కబెట్టాలి కూడా ! దీంతో అటవీ శాఖ అధికారులు దొరికిందే తడవుగా టోల్ గేట్ రుసుము జాతరకు విచ్చేస్తున్న భక్త జనానికి విజ్ఞప్తి అంటూ కార్ లేదా జీపు టోల్ గేట్ రుసుము ఏకంగా వెయ్యి రూపాయలు వసూలు చేయాలని నిర్ణయిస్తూ బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వారికి షాక్ ఇచ్చారు.
అదేవిధంగా ట్రాక్టర్ లేదా ఆటోకు టోల్ గేట్ నిమిత్తం ఐదు వందల రూపాయలు చెల్లించాలని, లారీ, బస్సు, డీసీఎంకు వెయ్యి రూపాయలను, టూ వీలర్ కు వంద రూపాయలను టోల్ ఫీజుగా నిర్ణయించి బోర్డు ఏర్పాటుచేసి సంబంధిత వర్గాలను ఆశ్చర్యపరిచారు. దీంతో ఈ పని ప్రభుత్వాన్ని అడిగి చేశారా లేదా అడగకుండా చేశారా అన్న అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
ఏడాదికోసారి వచ్చే వాహనాలకు ఇంత భారీ మొత్తంలో టోల్ ఫీజు వసూలు చేయడం భావ్యంగా లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు మాత్రమే జాతర జరగనుంది. గుహలో స్వామి దర్శనం కానుంది భక్తులకు.. కనుక ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని వీరంతా వేడుకుంటున్నారు.