డబ్బులు చేతులు మారి
వస్తువులు అవుతాయి
నిర్ణయాలు రోజులు మారాక
నిధుల రూపంలో ఏదో ఒక గూటికి చేరిపోతాయి
కరోనా లాంటి విపత్కర సమయంలో జగన్ మాత్రం
వెనుకడుగు వేయని కారణంగానే మంచి పేరు తెచ్చుకున్నారు
సంక్షేమ ఫలాలు అర్హులయిన వారికే అందించాలన్న తపన పడ్డారు
ఈ క్రమంలో తప్పులున్నా వీటిని పరిహరించుకోలేక పోతున్నారు
సంబంధిత తప్పిదాలను సవరించుకుంటే విమర్శలకు తావే లేని
సంక్షేమం సత్ఫలితాలు ఇస్తుంది అన్నది నూటికి నూరు శాతం నిజం.
ఆర్థిక సూత్రాలు అన్నవి రాయడం సులువు. పాటించడం కష్టం. కొన్ని సార్లు అవి దారి తప్పితే ఫలితాలు రావు. ఫలితాలు రాని చోట ప్రభుత్వాలు తిరుగుబాటును చవి చూడాల్సి వస్తుంది. ఇంతవరకూ ఆర్థిక పరంగా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇందుకు కరోనా లాంటి మహమ్మారులు కూడా ఓ కారణంగానే నిలిచాయి. అనేక విషయాల్లో వస్తు వినియోగం అన్నది ఇవాళ పేద ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాంతో సాధారణం కన్నా ఎక్కువగానే జీవన ప్రమాణం మెరుగుపడింది. డబ్బులు అదే పనిగా నెల నెల ఏదో ఒక రూపంలో జగన్ సంబంధిత లబ్ధిదారులకు అందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కొంత మేర ఆర్థిక వినిమయాన్ని ఆపడం లేదు. అదేవిధంగా వస్తు వినియోగాన్ని పెంచుకుంటూ పోతున్నాయి.
మార్కెట్ లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కొన్ని పనుల రూపంలో ఖర్చయిపోతున్నాయి. కొన్ని వస్తు రూపంలో ఇంటికి చేరిపోతున్నాయి. ఆ విధంగా ఆర్థిక సూత్రాలు అన్నీ ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ ఆ విధంగా ఏటా ఖర్చు చేస్తున్న యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మంచిగానే పేదలను ఆదుకుంటున్నాయి. వివిధ పథకాలు వాటి నిర్వహణ అన్నవి నిరంతర ప్రక్రియగా మారేక జగన్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆర్థిక భారం అయినా కూడా పేదలకు కొంత ఊతం ఇస్తున్నాయి. పథకాల అమలుపై క్షేత్ర స్థాయిలో మంచి పేరు ఉంది.
అనధికార సమాచారం ప్రకారం అనర్హుల ఏరివేత ఈ ప్రభుత్వానికి కూడా చేతగాలేదు. దీంతో జగన్ ఆశించిన విధంగా ఫలితాలు కొన్నింట రాలేదు. నగదు బదిలీ మరియు పారదర్శక పాలన అన్నవి దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి అని నిన్నటి వేళ సీఎం జగన్ చెప్పిన మాటలకు అర్థం వెతికితే కష్టం అయినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం ఒకటి తాను చేస్తానని పదే పదే గుర్తు చేస్తున్నారని! ఆ విధంగా జగన్ మరోమారు సంక్షేమ ఫలాలపైనే ఆశలు పెంచుకుని ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని !
– హమారా సఫర్ – మన లోకం ప్రత్యేకం