కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది.. యాసంగి పంటకు నీళ్లు రావని మాట్లాడుతున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గారు మండిపడ్డారు. 45 రోజుల్లో పంపు హౌజ్‌ల్లో సమస్యలు పరిష్కారమవుతాయని, యాసంగి పంటకు నీరందిస్తాం.. రైతులు రందీ పడాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి హరీశ్‌రావు గారు మీడియాతో మాట్లాడారు. నిజానికి గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు గారు పేర్కొన్నారు.
గోదావరికి అత్యధికంగా 1986లో వరదలు అధికంగా నమోదు అయ్యాయి. 1986లో 107.5 మీటర్ల వరద గోదావరిలో వచ్చింది. గోదావరి నది చరిత్రలోనే ఈ వరద అత్యధికం. మొన్న గోదావరి నదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ఈసారి 108.2 మీటర్ల వరద నమోదైంది. 1986లో వచ్చిన వరద కంటే కూడా 1.2 మీటర్లు ఎక్కువ. ఈ అసాధారణమైన వరద రావడం వల్ల పంపు హౌజ్ రెగ్యులేటర్ వద్దల ఉండే రబ్బర్ సీల్‌లు ఊడిపోయి పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు పోయాయి. ఇది దురదృష్టకరం. ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం జరిగిప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని వెల్లడించారు.
2008లో శ్రీశైలంలో వరదలు వచ్చినప్పుడు రోశయ్య సెక్రటేరియట్‌లో పడుకున్నారు. అదొక అసాధారణమైన పరిస్థితి. అప్పుడు శ్రీశైలంలో అన్ని పంపు హౌజ్‌లు కొట్టుకుపోయాయి. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పుడు గోదావరికి వచ్చింది. దానికి బీజేపీ నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారు. ప్రాజెక్టే పోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల రెండు పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు వచ్చాయి. మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. నీళ్లు రావు అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీవి అన్ని దింపుడు కళ్లెం ఆశలే అని చెప్పారు. బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్లు ఇస్తాం. రైతులు రందీ పడాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌రావు గారు స్పష్టం చేశారు.