ఆర్టీసీని భూస్థాపితం చేయాలని చూస్తున్నాడు – విజయశాంతి

-

ఆర్టీసీని కేసీఆర్‌ భూస్థాపితం చేయాలని చూస్తున్నాడని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ డిపోలో సీనియర్ మెకానిక్‌గా పనిచేస్తున్న సిబ్బంది ఒకరిని వీఆర్ఎస్ తీసుకోవాలంటూ కొద్ది రోజులుగా డిపో అధికారులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నరు. ఆయన వినకపోవడంతో పనిలో ఒత్తిడి తీసుకొస్తూ… మాటలతో ఇబ్బంది పెడుతున్నరు. సాధారణంగా మెకానిక్‌ కింద ఇద్దరిని సహాయకులుగా వేస్తరు. కానీ ఈయనకు మాత్రం ఒక్కరిని కూడా ఇవ్వకుండా మొత్తం పని భారం మోపుతున్నారని ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు. పనులు ఆలస్యమ‌యితే చార్జీ మెమోలు ఇస్తున్నరు. దీనికి తోడు ఎప్పుడైనా అవసరం వచ్చి సెలవులు అడిగితే… ఇంకా ఉద్యోగం చేయడం అవసరమా? అంటూ సూటిపోటి మాటలతో ఆఫీసర్లు విసిగిస్తున్నారన్నారు.


వీఆర్ఎస్ తీసుకోవాలంటూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నరు. ఇది ఒక్క క‌రీంన‌గ‌ర్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొన‌సాగుతోంది. ఆర్టీసీ కార్మికులను పొమ్మనలేక పొగబెడుతున్నరు. ఎంతమంది వీలైతే అంతమంది ఉద్యోగులను బయటకు పంపించాలని చూస్తున్నరు. యాజమాన్యం లెక్కల ప్రకారం టీఎస్​ఆర్టీసీలో 45,600 మంది ఉద్యోగులు ఉన్నరు. 20 ఏండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కార్మికులు ఎవరైనా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మే నెలలో సర్క్యులర్ జారీ చేశారన్నారు. రెండు నెల‌లు చూసినా కార్మికుల నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి సర్క్యులర్లు పంపారని వెల్లడించారు.

అయినా స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో నేరుగా అన్ని డిపోల్లోను హెడ్ క్లర్క్ దగ్గర రిజిస్టర్ పెట్టి విల్లింగ్ ఉన్న వారందరి పేరు, వివరాలు రాయమని చెప్పారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో కలిపి సుమారు 2,600 మంది పేర్లు రాశారు. దీన్ని చూసి జులై నెల మూడో వారంలో వీఆర్‌ఎస్ కోసం కొన్ని గైడ్ లైన్స్ రూపొందించి ఆర్టీసీ పరిధిలోని అని డిపోల మేనేజర్లకు లెటర్లు పంపించారు. విల్లింగ్ ఉన్నవారి నుంచి ఒక ఫార్మాట్‌లో వివరాలు తీసుకున్నరు. దీనికి జులై 31వ తేదీ గడువుగా పెట్టారు. అనారోగ్యం, ఇతరత్రా సమస్యలు ఉన్నవారిని వివరాలు రాయాలని ఒత్తిడి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా 530 మంది వివరాలు అందించారు. ప్రగతి రథ చక్రంగా ఎంతో వృద్ధి సాధించిన ఆర్టీసీని కేసీఆర్ సర్కారు అథోగతి పాలు చేసింది. తాజా పరిణామాలు చూస్తుంటే టీఎస్ ఆర్టీసీని ఎలాగైనా భూస్థాపితం చెయ్యాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వ్యవస్థలను నాశనం చేస్తున్న ఈ సర్కారుకు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news