తెలంగాణ పోరాటంలో విద్యార్థుల బలిదానాలను కారణమైన పార్టీలను ద్వేషించిన కోదండరాం నేడు అదే పార్టీలతో కలిసి దోస్తన్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఒకప్పుడు తెదేపాని తెలంగాణ ద్రోహి అన్నటువంటి కోదండరాం నేడు వారితో పొత్తు ఎలా పెట్టుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆయన ఢిల్లీకి, అమరావతికి గులాం అవ్వడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
పలువురు తెజస నేతలు నగేశ్, కార్యకర్తలు సోమవారం హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. నాడు ఎవరైతే తెలంగాణ జేఏసీని విచ్ఛిన్నం చేయాలని యత్నించారో వారికే కోదండరాం దగ్గరవ్వడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మహాకూటమికి ఇంత వరకు సీట్ల పంచాయతీ తేలలేదు.. అలాంటి వాళ్లు తెరాసకు అసలు పోటీయే కాదని ధీమా వ్యక్తం చేశారు.