ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో సెన్సేషన్ చాట్ జీపీటీ. ఈ ఏఐ సెన్సేషన్ సేవల విస్తృతి రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా న్యాయ సేవల్లోనూ చాట్ జీపీటీని వినియోగించారు. ఓ నిందితుడికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశం విషయంలో పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జి చాట్ జీపీటీ సాయం కోరారు. భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఈ సంఘటన మొట్టమొదటిదిగా భావిస్తున్నారు.
దుండగులు క్రూరత్వంతో ఇతరులపై దాడి చేసినప్పుడు.. అతడి బెయిల్ అభ్యర్థనపై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి? అని చాట్ జీపీటీని జడ్జీలు అడిగారు. దీనికి చాట్‌జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనిషి చంపుతున్నారు కాబట్టి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తాను అని బదులిచ్చింది. దాడి క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేసే విధివిధానాలు కూడా మారుతాయని చాట్‌జీపీటీ వివరించింది.
నేర తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పింది. నిర్దోషినని నిరూపించుకోవడానికి బలమైన సాక్ష్యాలుంటే తప్ప బెయిల్‌కు అర్హుడు కాడని వెల్లడించింది. అయితే, నిందితుడి నేర ప్రవృత్తి, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేయవచ్చని చాట్‌జీపీటీ సూచించింది.