తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారుల సమావేశం సమావేశం ఇవాళ ప్రగతి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లా లను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో వ్యాధుల ట్రెండ్స్, వాటి నివారణ, ఇతర కార్యక్రమాల తయారీలో ఈ ప్రాజెక్టు సహకారం అందిస్తుందని వెల్లడించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహకారం అందించేందుకు ఈ ప్రాజెక్టు సమాచారం దోహద పడు తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.