తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి భగభగలు పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున వడగాలులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మార్చి ప్రారంభంలోనే ఈ మండుతున్న ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 తర్వాత ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా జనం జంకుతున్నారు.
ఏటా ఏప్రిల్‌లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడు మార్చ్ నెలలోనే నమోదవుతుండడంతో మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయో అని ఊహించుకుని ప్రజలు భయపడుతున్నారు.