ఏపీ, తెలంగాణకు వర్షాల సూచన మరికొద్ది రోజులు ఉండనున్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడిందని.. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 13వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాత 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
‘హైదరాబాద్‌లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశల నుంచి గాలులు (గాలి వేగం గంటకు 14 నుంచి 20 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉందని’ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర కు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. భారీ ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తీరం వెంబడి 45 నుంచి 55 కిలో మీటర్లు లేదా కొన్ని చోట్ల 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
‘ఉత్తర కోస్తాఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.