కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోమాలో ఉందని మండిపడ్డారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ పై కూడా భట్టి విమర్శలు గుప్పించారు. టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందో తెలియడం లేదని మండిపడ్డారు. టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వచ్చాక రాష్ట్రంలో రెండో డోస్ కూడా నిలిచిపోయిందని అన్నారు.వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తర్వాత నుంచి వ్యాక్సినేషన్ పూర్తిగా ఆగిపోయిందని ఆక్షేపించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ వల్ల ప్రయోజనం లేదన్న సీఎస్.. హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. సీఎస్ సోమేశ్ కుమార్ కు సీరియస్ నెస్ లేదని… బిస్కెట్లు తింటూ కనిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ధరలు నిర్ణయించమని హైకోర్టు ఆదేశించినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని భట్టి అన్నారు. కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని విమర్శించారు.