వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినపడుతోన్న పేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా అందుకుంటోంది. అయితే ఆమె ఇటీవల నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లుగా నిలిచాయి!
గంభీరమైన గొంతుతో, కరుకైన మాటలతో, భయపెట్టే హావభావాలతో హీరోలకు దీటుగా నటిస్తున్న ఈ నటి- ఆఫ్‌స్క్రీన్‌లో అల్లరి అమ్మాయి. సమస్యల్లో ఉన్నవాళ్లకి అండగా నిలబడే అసలైన హీరో. అటు నటనలోనూ, ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న వరలక్ష్మిని పలకరిస్తే ఆమె మనసులోని జ్ఞాపకాలను ఇలా పంచుకుంది.
తెర మీద నన్ను చూసిన చాలామంది “మీరు బయట కూడా సీరియస్‌గానే ఉంటారా..” అని అడుగుతుంటారు. నిజానికి నేను చాలా సరదా మనిషిని. కానీ, నేను చేసే విలన్ పాత్రల వల్ల అందరూ సీరియస్ పర్సన్‌ని అనుకుంటున్నారు. ఆన్‌స్క్రీన్ వరలక్ష్మి గురించి తెలిసిన మీకు.. తెర వెనక వరూ ఎలా ఉంటుందో చెబుతా..
పుట్టి పెరిగింది చెన్నైలోనే. నాకు ఊహ తెలిసేప్పటికే అమ్మానాన్నలు విడిపోయారు. మా అమ్మ ఛాయ.. అవమానాలూ, ఆర్థిక సమస్యలూ ఎదుర్కొంటూనే నన్నూ, చెల్లినీ పెంచింది. అయినా ఎప్పుడూ భయపడలేదు, బాధపడలేదు. మాకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆశపడేది. కొన్నాళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. పైగా మగవారితో పనిచేయించడం, గంటలు గంటలు తానూ కష్టపడటం నాకు ఎంతో అబ్బురంగా అనిపించేది. అయితే తనకి మేం సినిమాలు చూడటం ఇష్టముండేది కాదు.
“నేను ఆరాధించే వ్యక్తి జయలలిత అమ్మ. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనేది నా కోరిక. నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. సెట్‌కి కూడా టైమ్‌కి వెళ్లడం అలవర్చుకున్నా. నాకు షార్ట్‌టెంపర్. నాకళ్ల ముందు తప్పు జరిగితే అస్సలు ఊర్కోను. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్… అన్నీ మాట్లాడగలను. నాకు పర్యటనలంటే చాలా ఇష్టం. ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాషలు నేర్చేసుకోవడం అలవాటు. రాజకుమారి, పోరాటయోధుల పాత్రల్లో నటించాలనుంది. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉండి మా పప్పీతో ఆడుకుంటా” అని చెప్పుకొచ్చింది.