థర్డ్‌ వేవ్‌ : కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు వార్నింగ్‌.. !

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తాత్కాలిక సీజే జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేసింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా కోర్టుకు డీహెచ్ నివేదిక అందించారు. నిపుణుల సలహా కమిటీ సమావేశం ఇంకా జరగలేదన్న ఏజీ ప్రసాద్.. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు కోర్టు కు తెలిపారు.

అయితే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాల ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మూడో దశ ముప్పు ముంచుకొస్తోందన్న హెచ్చరికలు ఉన్నాయన్న హైకోర్టు… కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఇప్పటికే కరోనా బారిన అనేక మంది చనిపోయారని… గత అనుభవాలతో నష్టాన్ని నివారించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నత్త నడకన కాకుండా.. వేగంగా కదలాలని… ప్రభుత్వాలు కొన్ని చేస్తున్నప్పటికీ.. మరింత చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

హైకోర్టు ఆదేశించినా.. కనీసం నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించ లేదని… జనగామ, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 1 శాతానికి మించి ఉందని ప్రస్తావించింది హై కోర్టు. ఆర్టీపీసీఆర్ పరీక్షల పాజిటివిటీ రేటు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారంలో మూడో దశ ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలని… పిల్లల చికిత్సకు అవసరమైన పడకలు, ఇతర వసతుల వివరాలు సమర్పించాలని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్, కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి హాజరు కావాలని.. ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో డీహెచ్, నోడల్ అధికారి వివరణ ఇవ్వాలని హైకోర్టు హెచ్చరించింది. ఇక కరోనా పరిస్థితులపై విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.