శరీరం మొత్తం నలుపు రంగులో ఉండే కడక్‌నాథ్ కోళ్ల గురించి తెలుసు కదా. వీటి మాంసం, గుడ్లు అత్యంత పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకనే ఈ కోళ్ల మాంసం, గుడ్లకు చక్కని డిమాండ్ ఉంటుంది. అయితే ఈ కోళ్ల మాంసం ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఈ కోడి మాంసం కేజీ ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. ఇక కోళ్లకు చెందిన ఒక గుడ్డు ధర రూ.30 గా ఉంది. మాంసం కాకుండా కోడిని కొనాలని అనుకుంటే కేజీకి రూ.850 వరకు ధర పలుకుతుండడం విశేషం.
కడక్‌నాథ్ కోళ్లు సాధారణ బ్రాయిలర్ కోళ్ల మాదిరిగా కావు. వీటిని పెంచేందుకు ఎక్కువ సమయం పడుతుంది. సాధారణ బ్రాయిలర్ కోళ్లకు పెరిగేందుకు 45 రోజులే పడుతుంది. కానీ కడక్‌నాథ్ కోళ్లకు సాధారణ బరువు వచ్చేందుకే సుమారుగా 8 నెలల వరకు సమయం పడుతుంది. ఇక కడక్‌నాథ్ కోళ్లు నిత్యం 100 గ్రాముల వరకు ఆహారాన్ని తింటాయి. అందుకనే వాటి మాంసం, గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ఒక కడక్‌నాథ్ కోడిని పెంచేందుకు సుమారుగా రూ.500 వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలోనే జంట నగరాలకు సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలు ప్రాంతాల్లో కడక్‌నాథ్ కోళ్లను కొందరు ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాల్లో పెంచి నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు. కొందరు అయితే నేరుగా ఫామ్‌ల నుంచి వాటిని కోళ్ల విక్రయశాలలకు తరలించి లాభాలు గడిస్తున్నారు. గతంలోనే ఈ కోళ్ల మాంసానికి గిరాకీ బాగా ఏర్పడగా.. ఇందుకు డిమాండ్ మరీ పెరిగింది. దీంతోనే వాటి మాంసం, గుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.