కోట బొమ్మాళిలో ఉద్రిక్త పరిస్థితులు.. భారీ ఎత్తున పోలీసుల మోహరింపు !

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. నిమ్మాడలో తన స్వగృహంలో ఉన్న అచ్చెన్నాయుడుని అరెస్టు చేసి పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తన సమీప బంధువు వైసిపి మద్దతుదారుడు అయిన అప్పన్న అనే వ్యక్తిని వైసీపీ తరఫున నామినేషన్ వేయకుండా బెదిరించారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 22 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరిప్రసాద్ ఉండగా, హరి ప్రసాద్ కుమారుడు సురేష్ ని ఏ2గా చేర్చారు.

అచ్చెన్నాయుడు ఏ3గా ఉండగా, కింజరాపు లలితకుమారి ఏ4గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలుసుకుని భారీ ఎత్తున తెలుగుదేశం శ్రేణులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. దీంతో కోటబొమ్మాళి, నిమ్మాడలలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక అచ్చెన్నాయుడు అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. జగన్ కక్ష సాధింపు చర్యలు ఇది పరాకాష్ట అని బాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పై జగన్ కక్ష కట్టి భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news