అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. రాష్ట్రంలోని సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేసే సిబ్బందికి సెలవు ప్రకటించింది. ఈ మేరకు పోలింగ్ జరగనున్న 30వ తేదీని వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక, ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ మూడవ తేదీన కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి.
రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణ సరిహద్దుల్లో 148 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ఆ రోజు..ముందు రోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందు రోజు మధ్నాహ్నం నుంచే చేరుకుంటారు. దీంతో ఎన్నికల విధులు..పోలింగ్ నిర్వహణకు వీలుగా రెండు రోజులు సెలవులు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎలను తీసుకొనేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ నెల 29,30 తేదీల్లో బడులకు సెలవులని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సెలవుల విషయాన్ని ఎన్నికల సంఘం సూచన మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పోలింగ్ పూర్తయ్య ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్దరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబర్ 1 కూడా సెలవు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.