వేసవి కారణంగా చర్మం నల్లగా మారుతుంది. ఎండలో తిరిగేవాళ్ళకు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని నీటిని తీసుకోవడంతో పాటు చర్మాన్ని నల్లగా మారుస్తుంది. సూర్య కిరణాల నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల కారణంగా చర్మం నల్లగా తయారవుతుంది. ఈ కిరణాలు చర్మంలోనికి చొచ్చుకుపోయి మెలనోసైట్లని ఉత్తేజపరుస్తాయి. ఈ మెలనోసైట్ల కారణంగా చర్మం నల్లగా మారుతుంది. అందుకే సూర్య కిరణాలు పడే చేతుల భాగాలు నల్లగా మారి ఒక దగ్గర తెల్లగా మరో దగ్గర నల్లగా కనిపిస్తాయి.
ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
పెరుగు, పసుపు
ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో కొద్దిగా పసుపుని కలుపుకోవాలి. బాగా పేస్టులాగా తయారు చేసుకున్నాక అది చేతులకి వర్తించాలి. దాదాపుగా 20నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగులోని ప్రోబయోటిక్స్ కారణంగా చర్మం తేమగా మారుతుంది. పసుపులో పోషకాలు నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మారుస్తాయి.
నిమ్మరసం
ఒక పాత్రలో గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని దానిలో కొంత నిమ్మరసాన్ని కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చేతులని ఉంచాలి. 20నిమిషాల తర్వాత చేతులని తీసివేసి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఒక రెండు సార్లు చేస్తే బాగుంటుంది. ఐతే నిమ్మరసంలో ఉంచిన చేతులు పొడిబారే అవకాశం ఉంది. అందువల్ల శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వర్తించండి.
కలబంద
కలబంద రసాన్ని తీసుకుని దాన్ని చేతులకి వర్తించండి. రాత్రిపూట కలబంద రసం పూసుకుని నిద్రపోవాలి. తెల్లారి లేచాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబందలోని యాంటీఆక్సిడెంట్లు చేతుల నల్లదనాన్ని పోగొడతాయి.