నెగెటివ్ ఆలోచనలు పుట్టగొడుగుల్లా బుర్ర నిండా మొలిస్తే వాటిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆలోచనల ప్రవాహాన్ని ఆపడం కష్టంగా మారుతుంది. అందుకే చాలా మంది అందులో పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. చాలా మందికి దాన్లో పడి కొట్టుకుపోతున్నామన్న విషయం కూడా తెలియదు. ఈ ఆలోచనలు పెరిగితే మెదడు మీద దుష్ప్రభావం పడుతుంది. ఒత్తిడి ఎక్కువై సరిగ్గా ఆలోచించలేకపోతుంది. దానివల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
మరి ఈ ఆలోచనల నుండి ఎలా తట్టుకోవాలో తెలుసుకుందాం.
దీని కొరకు ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్తలు సరికొత్త రేర్ టెక్నిక్ ని వాడుతున్నారు.
RARE టెక్నిక్ తో ఈ ఆలోచనలని ఎలా దూరం పెట్టవచ్చో తెలుసుకుందాం.
R- Recognise అంటే గుర్తించు
మీకు నెగెటివ్ గా అనిపిస్తున్న ఆలోచనలని ముందుగా గుర్తించాలి. ఏ ఆలోచన నెగెటివ్ గా అనిపించి మీ మీద ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ పోతుంటే నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడలా అలారం మోగినట్లు మీ మెదడు మీకు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఆలోచన నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
A- Accept అంటే ఒప్పుకో
మీకెలాంటి ఆలోచనలు ఇలా ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణమేంటని శోధించే ప్రయత్నం చేయకుండా నీకొచ్చిన నెగెటివ్ ఆలోచనలని ఒప్పుకో. ఆల్రెడీ ఏవి నెగెటివ్ ఆలోచనలో గుర్తించావు కాబట్టి, వాటిని ఒప్పుకుంటే చాలు.
R-Resolve అంటే పరిష్కరించు
నెగెటివ్ ఆలోచనలని ఒప్పుకున్న తర్వాత వాటిస్థానంలో ఏ ఆలోచనలను చేర్చితే మంచిగా జరుగుతుందో ఆలోచించాలి. ఏ ఆలోచనలు చేస్తే మీకు లాభం చేకూరుతుందో చూసుకోవాలి. మానసికంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండే వాటినే చేర్చుకోవాలి.
E-Endeavour అంటే గట్టి ప్రయత్నం చేయడం, సాధించడం
కొత్తగా చేర్చిన ఆలోచనలని ఆచరిస్తూ ఉండడం. నెగెటివ్ స్థానంలో చేరిన ఆలోచనలకి మరింత ఊతమిచ్చేలా కృషి చేయడం. పాజిటివ్ ఆలోచనలే పూర్తిగా మీ మనసులో నిండే వరకు ప్రయత్నాన్ని ఆపకపోవడం.