కూంబింగ్‌ దళాల పై దాడికి మావోల మూప్పేట వ్యూహం ఇదే

Join Our Community
follow manalokam on social media

ఆదివారం ఛత్తీస్ గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా టెర్రాం వద్ద మావోయిస్టులు భారీ వ్యూ హంతోనే కూంబింగ్‌ దళాలపై దాడికి తెగబడ్డారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో మాటువేసి తమ స్కెచ్ ని పక్కాగా అమలు చేశారు. కూంబింగ్‌లో ఉన్న జవాన్లను 3 వైపుల నుంచి చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మావోయిస్టులు చెట్లపైన ముళ్ల పొదల్లో నక్కి కాల్పులు జరపడంతో ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలుసుకునేలోపే భద్రత సిబ్బంది వైపు జరగరాని నష్టం జరిగిపోయింది.


మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ ఒకటో బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్న హిడ్మా..టీసీఓసీలో భాగంగా ఈ దాడికి వ్యూహరచన చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 10 రోజుల క్రితమే ఇంటెలిజెన్స్‌ వర్గాలకు హిడ్మా కదలికలపై ఉప్పందింది. దీంతో బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో శుక్రవారం రాత్రి నుంచి 2వేల మందితో కూంబింగ్‌ ప్రారంభించారు. టెర్రాం వద్ద 760 మంది జవాన్లు కూంబింగ్‌లో ఉన్నారు. అటువైపు 400 మంది నక్సల్స్‌ ఉన్నారు. అయితే..భద్రత బలగాలవైపే ఎక్కువగా ప్రాణనష్టం జరగడాన్ని బట్టి..మావోయిస్టుల వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. హిడ్మానే తన గురించి ఇన్ఫార్మర్ల ద్వారా లీకులు ఇప్పించి, ఈ దాడికి వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక మావోయిస్టుల వ్యూహం ఎలా ఉందంటే సంఘటనా స్థలం నుంచి జవాన్లు ఒకవేళ తప్పించుకుంటే ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని కూడా ముందుగానే పసిగట్టి..అక్కడా మాటువేశారు. అడవుల్లో మూడు వైపుల నుంచి జవాన్లను చుట్టు ముట్టిన మావోయిస్టులు ఎక్కడికీ వెళ్లే చాన్స్‌ ఇవ్వలేదు. తప్పించుకునే ప్రయత్నంలో కొందరు జవాన్లు పక్క గ్రామానికి వెళ్లారు. అయితే మావోయిస్టులు అప్పటికే ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జవాన్లు గ్రామంలోకి అడుగు పెట్టగానే కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు జవాన్ల మృతదేహాలు ఆ గ్రామ వీధుల్లో ఒకేచోట లభించాయి.ప్రాణాలతో దొరికిన జవాన్లను నక్సలైట్లు కత్తులతో చిత్రహింసలు పెట్టి, చంపినట్లు తెలుస్తోంది. కోబ్రా దళం ఇన్‌స్పెక్టర్‌ చేతులను మావోయిస్టులు నరికేశారు.

మావోయిస్టుల దాడుల్లో గాయపడ్డ జవాన్లకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర బలగాలు హెలికాప్టర్లను వినియోగిస్తాయి. ఈ విషయంపై అవగాహన ఉండడంతో మావోయిస్టులు వాటిని నిలువరించే ప్రయత్నాలు చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ సహాయ చర్యల కోసం ఘటనాస్థలికి రాగా మావోయిస్టులు కాల్పుల తీవ్రతను పెంచారు. మూడు గంటల పాటు ఇదే పరిస్థితి. దీంతో క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్‌ సాయంత్రం వరకు గానీ కిందకు దిగే పరిస్థితి లేకుండా పోయింది. తక్షణ వైద్య సేవలు అందకపోవడం..తీవ్ర రక్తస్రావం, డీహైడ్రేషన్‌ కారణంగా ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. అయితే ఈ జవాన్ ఇప్పుడు మావోయిస్టుల చెరలో ఉన్నారు. ఇందుకు సంబంధించి మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. జవాన్ రాకేశ్వర్‌సింగ్ తమ ఆధీనంలో ఉన్నాడని ఆ లేఖలో తెలిపారు. ఈ లేఖలో మరికొన్ని డిమాండ్లను మావోయిస్టులు ప్రభుత్వం ముందు ఉంచారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలనుఉపయోగిస్తున్నాయని, పోలీసు బలగాలను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు.

 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...