రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 2022-23 సంవత్సరానికి గాను రూపొందించిన మానవ హక్కుల కమిషన్ వార్షిక నివేదికను సీఎం జగన్ కు అందజేశారు. ఈ భేటీలో హెచ్చార్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ తో మానవ హక్కుల కమిషన్ కార్యవర్గం పలు అంశాలపై చర్చించింది.
ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నేడు సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్దిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. “గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి” అని సీఎం సూచించారు.