మొన్నటి వరకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలకు ఎంట్రీని నిషేధించారు. కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ పద్ధతిలో అనుమతించారు. అయితే ముఖ్యంగా దేవాలయాల్లోకి భక్తులకు అనుమతించలేదు. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుతున్న నేపథ్యంలో పూరిస్థాయిలో భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అయితే ఏడు కొండల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కూడా గత నెల నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు అనుమతించారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది.
ఇటీవల సర్వదర్శనాలు, శీఘ్రదర్శనాలకు టీటీడీ అనుమతించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాగా, మే నెలలో శ్రీవారి ఆదాయంపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటన చేశారు. తిరుమల వెంకన్నకు మే నెలలో హుండీ ద్వారా రూ.130.29 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. టీటీడీ చరిత్రలో ఓ నెలలో వచ్చిన అత్యధిక ఆదాయం ఇదేనని ధర్మారెడ్డి పేర్కొన్నారు. మే నెలలో స్వామివారిని 22,62,000 మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రూ.1.86 కోట్ల మేర జరిగాయని వెల్లడించారు.