సంజయ్ చెప్పిన ట్రిపుల్ ’ఆర్‘ లో చివరి ’ఆర్‘ రేవంత్ రెడ్డే – బాల్క సుమన్

హుజూరాబాద్ ఎన్నికల్లో నైతిక విజయం టీఆర్ఎస్ దే అని టీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బండి సంజయ్ చెబుతున్న ట్రిపుల్ ఆర్ లో చివరి ’ఆర్‘ రేవంత్ రెడ్డే అని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయి భారతీయ జనతా కాంగ్రెస్ గా మారాయని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ చేయిచ్చిందన్నారు. టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిందన్నారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని అన్నారు. 

హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంపై మాట్లాడుకుంటున్నారన్నారు బాల్క సుమన్. బీజేపీ గెలుపుకోసం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని కాంగ్రెస్ పార్టీ, ప్రజలు గుర్తించాలని కోరారు. ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పాలని  డిమాండ్ చేశారు. తరుణ్ చుగ్ విడుదల చేసిన మానిఫెస్టో లోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి హుజూరాబాద్ను.. తెలంగాణను అభివ్రుద్ది చేయాలని అన్నారు. ఒక ఉప ఎన్నికలో గెలవగానే బీజేపీ ఎగిరెగిరి పడుతుందని విమర్శించారు.